Mana Enadu: దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) వైపే ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు(Counting) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎగ్జిట్ పోల్స్(Exitpolls) హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ(BJP) నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు MLAలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హరియాణా(Haryana)లో గెలుపు కాంగ్రెస్ కూటమిదే అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ధ భారీ భద్రత
ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలిపింది. భద్రత చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులతోపాటు భద్రతా దళాలను మోహరించినట్లు వివరించింది. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించింది. తొలుత 7.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల(Postal Ballot Votes)ను లెక్కిస్తామని స్పష్టం చేసింది. అనంతరం EVMలలో నమోదైన ఓట్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని CEC పేర్కొంది. కాగా హరియాణాలోని 22 జిల్లాల్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 93 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, జమ్మూ కశ్మీర్‌లోని మొత్తం 20 కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
రెండు రాష్ట్రాల్లోనూ అన్నే అసెంబ్లీ స్థానాలు
జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా.. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతంపైగా ఓటింగ్(Voting) నమోదయింది. దాదాపు దశాబ్దం తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక హరియాణాలోనూ 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో అక్టోబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. గతంలో హరియాణాలో వరుసగా జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో BJP తన సత్తా చాటింది. అయితే ఈ సారి ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్(Congress) పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి.