ManaEnadu : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోసం విస్తృత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మస్క్ కు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పు
ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా నివాసం ఉన్నారంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. అయితే అవి నిజమని తేలితే గనుక మస్క్‌కు బహిష్కరణ ముప్పు ఉండొచ్చన్న వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఈ టెస్లా అధినేత (Tesla CEO).. అవన్నీ తనను అణచివేసేందుకు రాజకీయంగా ప్రేరేపితమైన ప్రయత్నాలంటూ వ్యాఖ్యానించారు.
ఇదీ అసలు విషయం
1990ల్లో ఎలాన్ మస్క్ (Elon Musk) తన ఉద్యోగ జీవిత ప్రారంభంలో అమెరికా (USA)లో అక్రమంగా నివాసం ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అవి నిజమైతే.. మస్క్ బహిష్కరణకు గురికావొచ్చని.. లేకపోతే ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కావొచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆయన అమెరికా పౌరుడిగా ఉన్న విషయం తెలిసిందే.
అదే నేను చెబుతుంటే నమ్మడం లేదు
దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్‌కు తన తల్లిద్వారా కెనడా పౌరసత్వం లభించింది. ప్రస్తుతం ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అయితే అమెరికా నుంచి బహిష్కరణ ముప్పు వార్తలపై తాజాగా ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నవంబర్ 5వ తేదీ జరిగే ఎన్నికల్లో (US Presidential Elections 2024) డెమోక్రాట్లు గెలిస్తే.. తనను అణచివేసేందుకు చేయాల్సిందంతా చేస్తారని పేర్కొన్నారు. తాను అదే విషయం చెబుతుంటే ఆ మాటలను ఇంకా చాలామంది నమ్మడం లేదని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.








