ManaEnadu : తెలంగాణ సర్కార్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Telangana Kutumba Survey)ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అయితే ఈ సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లకు తమ విధి నిర్వహణలో తిప్పలు తప్పడం లేదు. ఒక్కో ఇల్లు కథ ఒక్కోలా ఉందని.. సర్వే పూర్తి చేయడానికి దాదాపు 40 నిమిషాలు పడుతుందని వాపోతున్నారు.
ఇళ్లకు తాళాలు.. వాళ్లకు తిప్పలు
కొందరేమో ఇంట్లో ఉండటం లేదని.. మరి కొందరేమో వివరాలు సక్రమంగా చెప్పరంటూ సర్వే (Caste Survey)కు అష్టకష్టాలు తప్పవంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు పూర్తి వివరాలు చెప్పడానికి వెనకాడుతున్నారని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. చాలా వరకు ఇళ్లు తాము వెళ్లే సమయానికి తాళం వేసి ఉంటున్నాయని తెలిపారు.
ఆస్తి వివరాలకు నో.. అప్పులు మాత్రం ఎస్
జనాభా ఆధారంగా ఒక్కో ఎన్యూమరేటర్(Enumerator)కు 150 నుంచి 175 కుటుంబాలను కేటాయించాల్సి ఉన్నా సర్వే సమయంలో ఆ సంఖ్య పెరుగుతోంది. సర్వే రోజువారీ లక్ష్యం దిశగా సాగడం లేదని.. పల్లెల్లో వరికోత, పత్తి పనులకు కూలీలు, రైతులు ఉదయం 9 గంటలకే ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారని ఎన్యూమరేటర్లు అంటున్నారు. 75 ప్రశ్నల్లో స్థిరచరాస్తుల వివరాలను అడిగినప్పుడు కొందరు చెప్పడంలేదని.. ఆస్తి వివరాలు ఎందుకని మండిపడుతున్నారని చెప్పారు. వాహనాలు, ట్రాక్టర్లు లేవని చెబుతున్నారని.. కానీ అప్పుల సమాచారం మాత్రం అడిగిన వెంటనే చెప్పేస్తున్నారని ఎన్యూమరేటర్లు వెల్లడించారు.
టార్గెట్ తో కష్టాలు
“పట్టణాల్లో ఒక్కో ఎన్యూమరేటర్‌కు రోజూకు 25 ఫారాలు నింపాలని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. కొంతమంది ఇవి త్వరగానే పూర్తి చేస్తుండటంతో సమయం ఉన్నా.. ఫారాలు లేకపోవడం మిగతా కుటుంబాలను సర్వే చేయలేకపోతున్నాం. కనీసం రోజూకు 30 చొప్పున ఇస్తే బాగుండేది. డైలీ టార్గెట్ కంప్లీట్ చేయమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.” అని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. కుటుంబసభ్యుల వివరాల నమోదుకే ఇన్ని ఇబ్బందులు తలెత్తుతుంటే.. ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసే బాధ్యతలను తమకే అప్పగిస్తామని ప్రభుత్వం చెబుతోందనియయ ఆ పని భారం నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు.






