Mana Enadu : ‘కాయ్ రాజా కాయ్. వంద పెట్టు వెయ్యి గెలుచుకో’… ఎక్కడో సందుల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ బెట్టింగ్ (Betting) వ్యవహారం ఇప్పుడు నెట్టింటికి పాకింది. సరదాగా పది రూపాయలతో మొదలైన ఈ బెట్టింగ్.. క్రమంగా వేల రూపాయలు, లక్షలు, కోట్లు దాటుతోంది. ఒకప్పుడు నగరాలు, పట్టణాల వరకే పరిమితమైన ఈ వ్యవసనం ఇప్పుడు పల్లెలకూ పాకింది. యువతే కాదు స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు బెట్టింగులకు బానిసలవుతున్నారు.
ఒక్కరు చేసిన తప్పునకు కుటుంబం బలి
తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బు పొందచ్చని కొందరు, ఎలాంటి కష్టం పడకుండా.. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించొచ్చని ఇంకొందరు.. జల్సాలకు అలవాటు పడి మరికొందరు ఆన్ లైన్ బెట్టింగు(Online Betting)ల బాట పడుతున్నారు. మొదట కాస్త డబ్బు రాగానే.. మరింత పెట్టుబడి పెట్టి చివరకు ఉన్నదంతా కోల్పోతున్నారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారులు డబ్బులు తిరిగి చెల్లించాలని బెదిరింపులకు దిగడంతో ఉన్నదంతా అమ్మేసి అప్పుల పాలవుతున్నారు. చివరకు ఆత్మాభిమానంతో ఆత్మహత్య(Suicide)లకు పాల్పడుతున్నారు. ఇలా ఒక్కరు చేసిన తప్పునకు కుటుంబమంతా బలైపోతోంది.
కుటుంబం ఆత్మహత్య
తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య(Family Suicide)కు పాల్పడ్డారు. మృతులను సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22)గా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబానికి చెందిన హరీశ్ ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పుల పాలు కావడంతో ఊర్లో ఉన్న పొలం అమ్మేశాడు. ఇక పొలం అమ్మిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






