
ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. HCUలో చెట్లను నరికివేయడం వల్ల వన్యప్రాణులు చెల్లాచెదురయ్యాయని కొందరు ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించారని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అన్నారు. ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టించి, వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HCU ఉదంతం ప్రభుత్వానికి గుణపాఠం
మరోవైపు ఇదే వివాదంపై తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. HCU ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పర్యావరణాన్ని కాపాడేందుకు HCU విద్యార్థులు చేసిన పోరాటం అభినందనీయం అని తెలిపారు. ఈ వ్యవహారంలో సర్కారు వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు పలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
పాలేవో నీళ్లేవో జనం తెలుసుకున్నారు
ప్రజల ఆకాంక్షలు ఉద్యమ పార్టీ అయిన బీఆర్‌ఎస్(BRS Party)కే తెలుసని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని తెలిపారు. మన చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు పాలేవో..నీళ్లేవో తెలిసిందని వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. రజతోత్సవ సభకు (BRS Silver Jubilee) లక్షలాదిగా జనం తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని వివరించారు.