
కరోనా సృష్టించిన భయం ఇప్పుడు ఏ చిన్న వైరస్.. ప్రపంచంలో ఏ మూల సోకినా అందర్నీ అప్రమత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కడో బర్డ్ ఫ్లూ సోకిందంటే.. వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రజలు కూడా చికెన్, కోడిగుడ్లు తినడం మానేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో కొంతకాలంగా కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతో చికెన్, ఎగ్స్ తినడం మానేశారు.
నష్టాల్లో ఫౌల్ట్రీ రంగం
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఫౌల్ట్రీ రంగం నష్టాల్లో కూరుకుపోయింది. కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu) వస్తుందన్న వదంతులు వ్యాప్తి చెందడంతో దాని ప్రభావం ఫౌల్ట్రీ రంగంపై పడింది. ఫలితంగా ఈ వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ వైరస్ పై రకరకాల కథనాలు వైరల్ కావడంతో జనం భయపడుతున్నారు. బాగా ఉడికించి తినే చికెన్ (Chicken), గుడ్ల (Eggs)లో ఎలాంటి వైరస్ బతకదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు.
ఫ్రీగా చికెన్, ఎగ్స్
ఈ నేపత్యంలోనే పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంట నగరాల్లో శుక్రవారం రోజున చికెన్, ఎగ్ మేళాలు (Egg Mela) నిర్వహించారు. ఇందులో భాగంగా చికెన్ స్నాక్స్, కోడిగుడ్లను ఫ్రీగా పంపిణీ చేశారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి హాని లేదని అవగాహన కల్పించేందుకే ఉచితంగా పంపిణీ చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఫ్రీ చికెన్, ఎగ్స్ తినేందుకు భారీ ఎత్తున ప్రజలు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.