Mana Enadu : డిసెంబరు 31వ తేదీన 2024కు ముగింపు పలికేందుకు.. 2025 కొత్త ఏడాదికి (New Year 2025) స్వాగతం పలికేందుకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ రాత్రి హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
అందుకే ఫ్రీ రైడ్
ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ (Telangana Four Wheelers) సభ్యులు తెలిపారు. డిసెంబరు 31వ తేదీన చాలా మంది పార్టీ మోడ్ లో ఉంటారని, కొంతమంది మద్యం సేవిస్తారని ఈ క్రమంలో మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. న్యూ ఇయర్ వేళ రోడ్డు ప్రమాదాలు జరగకూడదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు
మరోవైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. డిసెంబరు 31వ తేదీన అర్ధరాత్రి 12.30 గంటల వరకు (జనవరి 1 ప్రారంభ వేళల్లో) మెట్రో రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో ఎక్స్ వేదికగా పేర్కొంది. ప్రతి కారిడార్‌లో చివరి మెట్రో స్టేషన్ నుంచి ఆఖరి సర్వీసు 12.30 గంటలకు బయలు దేరుతుందని తెలిపింది.








