ManaEnadu:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ(Delhi) కొత్త సీఎం(New CM) ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో పార్టీ MLAలు, ఇతర సీనియర్ నాయకులతో కేజ్రీవాల్ తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మహిళా మంత్రి ఆతిశీ(Atishi) పేరును ప్రతిపాదించారు. దీనికి ఇతర పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారు. దీంతో ఢిల్లీ తదుపరి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఆతిశీ ఎంపికైంది. పార్టీ విధాన నిర్మాణంలో కీలకపాత్ర పోషించినప్పటి నుంచి ఢిల్లీ సీఎం పదవి వరకు కేవలం పదేళ్ల వ్యవధిలో ఆమె పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు.
ఆతిశీ విద్యార్హతలు ఇవే..
43 ఏళ్ల ఆతిశీ 8 JUNE 1981న న్యూ ఢిల్లీలో జన్మించారు. ఆమె 2001లో ఢిల్లీ యూనివర్శిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంతకుముందు పూసా రోడ్‌లోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆమె 2003లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తరువాత, 2005లో ఆమె ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్డలెన్ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. అనంతరం 2013లో ఆతిశీ తన విధాన నిర్మాణ విభాగంతో AAPలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2019లో తూర్పు ఢిల్లీ(East Delhi) నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో BJP తరఫున పోటీ చేసిన క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా ఢిల్లీ రాజకీయాల్లో ఆమె బలమైన ముద్ర వేశారు.
సంక్షోభం నుంచి సీఎం స్థాయి వరకూ..
అనంతరం ఆమె 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కల్కాజీ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌పై 11,422 ఓట్ల ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. ఆప్ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆతిశీ మంత్రిగా ఎదిగారు. ఇద్దరు మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా వేర్వేరు కేసులతో జైలుకు వెళ్లడం, పార్టీ నాయకత్వం సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆమెకు కేజ్రీవాల్ అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈ క్రమంలో సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి ఆమె ఢిల్లీ మంత్రివర్గంలో చేరారు. తాజాగా ఢిల్లీ సీఎం పదవిని అధిష్ఠించబోతున్నారు.






