
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరును సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.
హీరోగా మొదటి అడుగు
పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా హిట్ కాలేదు. ఈ మూవీ టైటిల్ కార్డ్స్‌లో పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ బాబుగా వేశారు. అదే ఆయన అసలు పేరు. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి సెంటిమెంట్ ప్రకారం పేరులో హనుమంతుడి పేరు ‘పవన్’ ఉండాలనే ఉద్దేశంతో అదే పేరుగా మార్చాడు. .
‘గోకులంలో సీత’తో పవన్ కళ్యాణ్‌గా మారిపోయిన కళ్యాణ్ బాబు
పవన్ నటించిన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాలో తొలిసారి ‘పవన్ కళ్యాణ్’ అనే పేరును టైటిల్ కార్డ్స్‌లో వేశారు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటినుండి కళ్యాణ్ బాబు కాస్తా, పవన్ కళ్యాణ్’గా ఆయన పేరు స్థిరపడిపోయింది.
ఈ సినిమా ప్రెస్ మీట్‌లో పోసాని మాట్లాడుతూ:
ఈ సినిమా ప్రెస్ మీట్ సమయంలో పోసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో పవర్ స్టార్ అవుతాడని అన్నాడు. దీంతో ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనే పేరు జనాల్లోకి బాగా వెళ్లిపోయింది.. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘సుస్వాగతం’ మూవీ టైటిల్ కార్డ్స్‌లో పవర్ స్టార్ అని వేశారు. అదే పవర్ స్టార్ ట్యాగ్ ఆయన పేరులో భాగమైపోయింది.
సుస్వాగతంతో ‘పవర్ స్టార్’
సుస్వాగతం సినిమా పెద్ద హిట్ కావడం వల్ల ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అనేది అభిమానుల్లో రెగ్యులర్ అయిపోయింది. అప్పటి నుంచి అభిమానులు, మీడియా కూడా ‘పవర్ స్టార్’ అని పిలవడం మొదలెట్టారు.
స్ట్రైయిట్ హిట్లు – పవన్ స్టార్‌గా ఎదుగుదల
తర్వాత తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు పవన్ కళ్యాణ్‌ని ప్రేక్షకుల్లో ఓ మాస్ హీరో, యూత్ ఐకాన్, పవర్ స్టార్ గా నిలబెట్టాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, సినిమాలలో నటిస్తున్నాడు. హరి హర వీరమల్లు జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్.