ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ. ఈ శుభముహూర్తాన బంగారం కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. అందుకే ఆరోజు తప్పకుండా పిసిరింతైనా పసిడి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అక్షయ తృతీయకు సామాన్యులు బంగారం కొనుగోలు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే పుత్తడి రేట్లు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. గోల్డ్ ధరలు లక్ష రూపాయల వరకు చేరాయి. అయితే రెండ్రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
పెరిగిన గోల్డ్ రేట్లు
అయితే తాజాగా మాత్రం బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా మంగళవారం రోజున గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో సోమవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ తులం ధర రూ.97,530 ఉండగా.. మంగళవారం నాటికి రూ.440 పెరిగి రూ.97970 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం నాడు రూ.89400 ఉండగా మంగళవారం నాటికి రూ.400 పెరిగి రూ.89,800 వద్ద పలుకుతోంది. మరోవైపు సోమవారం కిలో వెండి ధర రూ.99,600 ఉండగా, మంగళవారం నాటికి రూ.207 తగ్గి రూ.99,393కు చేరుకుంది.






