ManaEnadu : తెలంగాణ(Telangana)లో మరికొన్ని రోజుల్లో మరో ఎన్నికకు నగారా మోగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం(Graduate MLC Polls 2024)తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజక వర్గం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల(Teacher MLC Polls 2024)కు ఎన్నికల నోటిఫికేషన్ కొద్దిరోజుల్లో వెలువడనుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇవాళే చివరి రోజు
గత ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకుని ఓటేసిన వారు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియకు నేటితో (నవంబరు 6వ తేదీ) గడువు ముగియనుంది. ఓటు వేయాలనుకున్న వారు ఇవాళ్టి లోపు ఓటు రిజిస్టర్ (MLC Vote Registration) చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
డిసెంబరు 30న తుది జాబితా
ఓటర్ల ముసాయిదా జాబితా ఈనెల 23వ తేదీన ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. డిసెంబరు 9వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
సర్కార్ కొలువు వదిలి మరీ ఎన్నికల బరిలోకి
పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy), టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డిల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29 తేదీన ముగియనుండటంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆశావహులు కాంగ్రెస్ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు స్వతంత్రులు కూ డా భారీ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. టీచర్ ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసేందుకు కొంతమంది ఉపాధ్యాయులు సర్కారు కొలువుకు రాజీనామా చేసి మరి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.






