పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Youtuber Jyoti Malhotra) గురించి రోజురోజుకూ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. గతంలో పాక్లో పర్యటించిన ఆమెకు (Pakistan Tour) అక్కడ భారీ భద్రత కల్పించినట్లు బహిర్గతమైంది. జ్యోతికి ఏకే 47లతో సిబ్బంది భద్రత కల్పిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆరుగురు వ్యక్తులతో భారీ భద్రత
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో స్కాటిష్ యూట్యూబర్ క్యాలమ్ మిల్ సైతం అక్కడ పర్యటిస్తూ పలు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వాటిలోని ఓ వీడియోలో లాహోర్‌లోని అనార్కలి బజార్‌లో జ్యోతి వీడియోలు తీస్తూ క్యాలమ్ మిల్‌కు ఎదురు పడింది. దీంతో అతడు తాను స్కాటిష్ యూట్యూబర్‌గా జ్యోతిని పరిచయం చేసుకున్నాడు. తాను భారత్ నుంచి వచ్చానని జ్యోతి సమాధానం చెప్పి ‘మొదటి సారి పాక్‌కు వచ్చారా’ అని అతడిని అడిగింది. ఇప్పటివరకు ఐదుసార్లు వచ్చినట్లు అతడు చెప్పాడు. కొంత సంభాషణ తర్వాత అమె వెళ్తుండగా.. ఆరుగురు వ్యక్తులు ఓ డ్రెస్ కోడ్లో ఏకే 47 తుపాకీలతో జ్యోతికి భద్రత కల్పిస్తుండగా ఆ వీడియో కూడా తీశాడు. ఆమెకు భద్రత, వారి వద్ద ఉన్న ఆయుధాలను చూసి యూట్యూబర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఆమెకు అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది’ అని అతడు తన అభిమానులను ఉద్దేశించి ప్రశ్నించాడు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా..
గూఢచర్యం కేసు దర్యాప్తులో పాక్ ఇంటెలిజెన్స్తో తనకు సంబంధాలున్నట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాక్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్నని చెప్పింది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని ఆమె వెల్లడించింది. పహల్గాం దాడికి కొన్ని నెలల ముందుకు జ్యోతి అక్కడ పర్యటించినట్లు తేలిది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.






