
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కుదిపేస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అవసరం ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దని సూచించింది. ఇక గురువారం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. అమీర్ పేట్, ఎస్.ఆర్.నగర్, మధురా నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మూసాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, కోఠి, మలక్ పేట్, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మేట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది. రోడ్లపైకి వరద నీరు ఒక్కసారిగా చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు
భారీ వర్షాల నేపథ్యంలో GHMC, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. అన్ని విభాగాలు కలిసి పనిచేసి తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.
Heavy rains on August 7, 2025, triggered flash floods in Hyderabad, with areas like Khajaguda receiving up to 134 millimeters of rainfall in one to two hours. #HyderabadRains #FlashFloods #Khajaguda #HyderabadWeather #RainAlert #UrbanFlooding #August2025Rains #IndiaWeather pic.twitter.com/JI6mgVy1Er
— Global Updates 🌍 (@GlobalUpdates7) August 8, 2025
నిండుకుండలా హిమాయత్ సాగర్
ఇక నిన్న (ఆగస్టు 7) కురిసిన భారీ వర్షపాతానికి శివారులో ఉన్న హిమాయత్ సాగర్(Himayath Sagar) నిండుకుండని తలపిస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి నీటిని మూసీ నది(Moosi River)లోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయమై జీహెచ్ఎంసీ అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా సహాయం కోసం 040 – 2111 1111ను సంప్రదించాలని అధికారులు సూచించారు.