సమ్మర్.. మనమంతా ఏమనుకుంటాం.. ఏప్రిల్… మే అని అనుకుంటుంటాం. కానీ ప్రస్తుతం అలా చెప్పుకునే రోజులు పోయాయ్. మారుతున్న వాతావరణ పరిస్థితులు(Weather Conditions).. రోజురోజుకూ క్షీణించిపోతున్న అడవుల కారణంగా జనవరి, ఫిబ్రవరి టైంలోనే సూరీడు(SUN) భగభగమనిపిస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది (2024) అత్యధిక ఉష్ణోగ్రతలు(High Temperatures) నమోదైన సంవత్సరంగా రికార్డైంది. అయితే ఈ ఏడాది అంతకు మించి ఎండలు మండిపోవడం పక్కా అంటున్నారు వాతావరణ నిపుణులు(Meteorologists). జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
‘లానినా’ బలహీనపడటంతోనే..
వాతావరణ మార్పుల ప్రభావం ‘లానినా(Lanina)’ పరిస్థితులపై పడుతోంది. ‘లానినా’ పరిస్థితులు బలహీనపడటంతో శీతాకాలం(Winter)లోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు. వచ్చే వారం నుంచి తూర్పు, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అయిదు డిగ్రీల వరకు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ(Department of Meteorology) అంచనా వేస్తోంది.
రాయలసీమ, తెలంగాణలోనే అధికం
ఇప్పటికే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత ప్రారంభమైంది. నిన్న (జనవరి 31) APలోని కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం గరిష్ఠంగా 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, అన్నమయ్య, YSR, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, NTR, ఏలూరు తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ, తెలంగాణ(Telangana)లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.








