Mana Enadu : హరిహరులకు కార్తికమాసం (Karthika Masam) ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసం శివకేశవులకు చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. కార్తిక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని.. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని అంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది కార్తిక పౌర్ణమి (Karthika Poornima) నవంబర్ 15వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ రోజున 365 వొత్తులతో దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వొత్తుల దీపంతో పాటు నక్షత్ర దీపం కూడా వెలిగిస్తే గ్రహ, జాతక దోషాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. మరి ఈ నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి అంటే..?
నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి?
కార్తిక పౌర్ణమి రోజున సాయంత్రం శివాలయానికి (Shivalayam) వెళ్లి.. దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో అలకాలి. అనంతరం నక్షత్ర ముగ్గు (Nakshtra Muggu)లో (ఈ ముగ్గు కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు) పసుపు, కుంకుమ ఉంచి 27 తమలపాకులు ఉంచి వాటి మీద 27 మట్టి ప్రమిదలు ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి నువ్వులు నూనె పోసి 2 లేదా మూడు వత్తులు వేసి ఏకహారతితో దీపారాధన చేయాలి.
మట్టి ప్రమిదలు లేకపోతే 27 ఉసిరి దీపాలు (Karthika Deepam) వెలిగించవచ్చు. దేవాలయాలకు వెళ్లలేనివారు ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు. కార్తిక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవ గ్రహాలు, 27 నక్షత్రాల అనుగ్రహం లభిస్తుందని, జ్యోతిష్కులు చెబుతున్నారు. గ్రహ, నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని తెలిపారు.
దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి: అయితే ఇంటి వద్ద వెలిగించిన నక్షత్ర దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టి ప్రమిదలు, ముగ్గు మిశ్రమాన్ని ఓ బట్టతో క్లీన్ చేసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు పండితులు








