బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) కాంబోలో వస్తున్న మూవీ ‘వార్ 2(War-2)’. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ విడుదలకు మరో 3 రోజులే ఉండటంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించింది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోల పేర్లతో నినాదాలు చేస్తూ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్ మాట్లాడుతూ తన సహనటుడు ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను..
“తారక్… నేను నిన్ను కేవలం గమనించడమే కాదు, నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను” అని అన్నారు. ఎన్టీఆర్‌ను సింగిల్ టేక్ స్టార్(Single Take Star) అని ఎందుకంటారో తనకు సెట్‌లో అర్థమైందని హృతిక్ తెలిపారు. “ఒక షాట్‌లోకి వెళ్లేటప్పుడు 99.99 శాతం కాదు, వందకు వంద శాతం ఎలా ఇవ్వాలో తారక్ నుంచి నేర్చుకున్నాను. అందుకే అతను షాట్ పూర్తయ్యాక మానిటర్ కూడా చూసుకోడు. ఎందుకంటే తను వంద శాతం ఇచ్చానని అతనికి తెలుసు. ఈ విషయాన్ని నా భవిష్యత్ సినిమాల్లో నేను తప్పకుండా పాటిస్తాను. ఇది నేర్పినందుకు నీకు ధన్యవాదాలు తారక్” అని హృతిక్ చెప్పారు.
మా ఇద్దరి ప్రయాణంలో చాలా పోలికలు ఉన్నాయి
గత 25 ఏళ్లుగా తమ ఇద్దరి ప్రయాణంలో చాలా పోలికలు ఉన్నాయని, అందుకే NTRలో తనను, తనలో ఎన్టీఆర్‌ను చూసుకుంటామని హృతిక్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా హృతిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎన్టీఆర్ మీకందరికీ అన్న అయితే, నాకు తమ్ముడు” అంటే ఎమోషనల్‌గా టచ్ చేశారు. కాగా యశ్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా(Adhitya Chopra) నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హృతిక్ సరసన కియారా అద్వానీ(Kiara Advani) కథానాయికగా నటిస్తుండగా, ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రంతోనే బాలీవుడ్(Bollywood)లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






