
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ బంధువు దారుణ హత్యకు గురయ్యారు. పార్కింగ్ విషయంతో కొంతమంది అతడితో గొడవపడి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో జంగ్ పురా భోగల్ లేన్ లో ఓ వ్యక్తి తన స్కూటీని పార్క్ చేశారు. నటి హ్యుమా ఖురేషీ (Huma Qureshi) బంధువు ఆసిఫ్ ఖురేషీ (Asif Qureshi) ఆ స్కూటీని అక్కడి నుంచి తీసేయాలని కోరారు. అందుకు సదరు వ్యక్తి ఆసిఫ్ తో గొడవ పడ్డాడు. అక్కడితో ఆగకుండా తన ఫ్రెండ్స్ ను పిలవడంతో వారు వచ్చి ఖురేషీతో వాగ్వాదానికి దిగారు.
పదునైన ఆయుధాలతో దాడి
వారి మధ్య మాటామాటా పెరగడంతో ఆసిఫ్ ఖురేషీని కొట్టి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో ఆసిఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అతడిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. చిన్న పార్కింగ్ విషయం కారణంగా తన భర్తను దారుణంగా హత్య చేశారని ఆసిఫ్ భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆసిఫ్ పొరుగు వారి స్కూటీని తీసేయాలని కోరినట్లు చెప్పారు. అది గొడవకు దారితీసిందని వెల్లడించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు.