
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం (ఆగస్టు 11) సాయంత్రం నుండి మళ్లీ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ముషీరాబాద్, తార్నాక, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సేరిలింగంపల్లి, బంజారాహిల్స్, అమీర్‌పేట్, మణికొండ వంటి ప్రముఖ ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లు జలమయమై, ట్రాఫిక్ (Traffic) గంటల తరబడి స్తంభించింది. లోతట్టు ప్రాంతాలైన లక్డీకాపూల్, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లో నీరు నిలిచి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో గంటకు 8-10 సె.మీ. వర్షపాతం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ (TGDPS) ప్రకారం, పలు ప్రాంతాల్లో గంటకు 8-10 సె.మీ. వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్‌లో రాత్రి 12 గంటాల వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, గంటకు 20-30 కి.మీ. వేగంతో గాలులు కొనసాగుతాయని హెచ్చరించింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్‌లలో నీటి మట్టం పెరగడంతో మూసీ నది (Moosi River)లోకి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), HYDRAA బృందాలు వరద నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. మేయర్ గడ్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, చెట్లు విరిగిపడటం వంటి సమస్యలు నేలకొన్నాయి.
అధికారులతో CM రేవంత్ సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించి, విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. కాగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, నీటిలో నడవకుండా జాగ్రత్తగా ఉండాలని GHMC సూచించింది. సమస్యల కోసం GHMC హెల్ప్‌లైన్ (040-21111111) లేదా MyGHMC యాప్‌ను సంప్రదించాలని కోరింది. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించిన నేపథ్యంలో, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.