Mana Enadu : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా (Hydra) తన విధుల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రాకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. మరోవైపు హైడ్రా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ ను ప్రకటించింది.
హైడ్రా న్యూ ఇయర్ రెజల్యూషన్
కొత్త ఏడాదిలో ఆక్రమణలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు (Hydra Complaints) తీసుకోనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని ప్రజలకు సూచించారు. నగరంలో చెరువుల సంరక్షణ కోసం కొంత మందికి ఇబ్బంది అయినా, కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు.
టెక్నాలజీతో ఆక్రమణల గుర్తింపు
ఆక్రమణలను గుర్తించడంలో టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోందని రంగనాథ్ (Hydra Ranganath) తెలిపారు. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా చెరువులను గుర్తించి హైడ్రా వాటిని కాపాడుతుందని చెప్పారు. దాని ద్వారానే ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. నాళాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువులో కలుస్తున్నాయని హైడ్రా కమిషనర్ వివరించారు.
హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు (Hydra Funds) మంజూరు చేసింది. హైడ్రా ఆఫీసు నిర్వహణ, వాహనాల కొనుగోలు, కూల్చివేతల చెల్లింపుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైడ్రాకు నిధులు కేటాయించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






