ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన ‘హైడ్రా(Hydra)’ యమా స్పీడుగా తన విధులు నిర్వహిస్తోంది. గుంట జాగా ఆక్రమణకు గురైందని తెలిస్తే చాలు అది నిజమో కాదో తేల్చేసి.. నిజమేనని నిర్ధారణైతే చాలు బుల్డోజర్లను పంపి అక్రమ కట్టడాలు కూల్చేస్తోంది. ఇక తాజాగా ఇలాంటి సమస్యలుంటే ఫిర్యాదులు ఇవ్వాలని.. వెంటనే తాము విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) చెప్పడంతో ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు.
ఐలాపూర్‌లో హైడ్రా కమిషనర్
ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం అక్కడ పర్యటించారు. తమ ప్లాట్లు కబ్జా (Plots Occupation) చేస్తున్నారంటూ స్థానికంగా ఉన్న ఓ ప్లాట్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఐలాపూర్‌లో పర్యటించారు. బాధితుల సమస్యలు వింటున్న క్రమంలో హైకోర్టు న్యాయవాది (High Court Lawyer) ముఖీం జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
భయపెట్టేందుకు యత్నం
అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. భయభ్రాంతులకు గురి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఉందని అన్నారు. రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరు వర్గాలు చెప్పింది వింటామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామన్న ఆయన.. అన్ని అంశాలను పరిశీలించి 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.







