చెస్ ఒలింపియాడ్‌లో భారత్ నయా హిస్టరీ.. ఛాంపియన్స్​కు మోదీ అభినందనలు

ManaEnadu:చెస్ ఒలింపియాడ్‌-2024 లో భారత్ (India)​ నయా చరిత్ర లిఖించింది. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ ఫిడే (45th FIDE Chess Olympiad 2024) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్‌ (Gukesh), అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్‌లలో గెలిచారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్‌ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు. పురుషుల జట్టు తొలి ఎనిమిది రౌండ్‌లలో గెలిచి, తొమ్మిదో రౌండ్‌ను డ్రాగా ముగించింది. కీలకమైన పదో రౌండ్‌లో 2.5-1.5 తో బలమైన అమెరికాను ఓడించి.. చివరలో 11వ రౌండ్‌లో స్లొవేనియాపై పైచేయి సాధించింది.

మరోవైపు ఈ పోటీల్లో భారత మహిళల జట్టు (Chess Women’s Team) కూడా తొలిసారి స్వర్ణం దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. 11వ రౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి. హారిక – దివ్య దేశ్‌ముఖ్‌ తమ గేమ్‌లలో గెలుపొందగా.. ఆర్‌. వైశాలి గేమ్​ను డ్రా గా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్‌ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో మహిళల జట్టు విజయ తీరాలకు చేరింది. ఇలా భారత్‌ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు (Chess Olympiad Gold Medals) చేరాయి.

45వ చెస్ ఒలింపియాడ్​లో భారత పురుషుల, మహిళల చెస్‌ జట్లు అద్భుతాలు సృష్టించడంతో ఆ ఛాంపియన్లకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికి రెండు స్వర్ణాలను అందించిన ఈ ఛాంపియన్స్​ను తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభినందించారు. “మన చెస్ బృందం 45వ #FIDE చెస్ ఒలింపియాడ్‌ను గెలుచుకోవడంతో భారతదేశానికి చారిత్రాత్మక విజయం! చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, అలాగే మహిళల విభాగంలో భారత్ స్వర్ణం సాధించింది! మన అద్భుతమైన పురుషుల, మహిళల చెస్ జట్లకు అభినందనలు. ఈ అద్భుతమైన విజయం భారతదేశ క్రీడా పథంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఈ విజయం తరతరాలుగా చెస్ ఔత్సాహికులకు ఆటలో రాణించేందుకు స్ఫూర్తినిస్తుంది.” అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

Share post:

లేటెస్ట్