కర్తార్‌పుర్‌ కారిడార్‌పై భారత్‌, పాక్‌ కీలక నిర్ణయం

Mana Enadu : కర్తార్‌పుర్‌ కారిడార్‌ (Kartarpur Corridor)పై భారత్‌, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నడవాపై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. ఇందుకు అంగీకరించినట్లు ఇరు దేశాలు తాజాాగా ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ.. ఈ నడవాను ఉపయోగించుకునే భక్తులపై ఎలాంటి రుసుం విధించవద్దని పాక్‌ను కోరినట్లు తెలిపింది.

ఒక్కరికి 20 డాలర్ల రుసుం

ఈ నడవా(Nadawa)ను ఉపయోగించుకుంటున్న భక్తులపై పాకిస్థాన్ ప్రతి ఒక్కరి నుంచి 20 డాలర్లను సర్వీస్‌ రుసుం కింద వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది భక్తులకు భారంగా మారుతుండటంతో.. రుసుం విధించొద్దని కోరింది. ఇక ఈ కారిడార్‌ పొడిగింపు నిర్ణయం వల్ల భక్తులు నిరంతరాయంగా ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

సిక్కుల పవిత్ర ప్రాంతం

భారత్‌లోని డేరా బాబా నానక్‌ నుంచి పాక్‌లోని నరోవాల్‌ జిల్లాలో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ ఈ కారిడార్‌(Kartarpur Corridor) నిర్మాణం జరిగింది. సిక్కుల గురువు గురునానక్‌ తన చివరి రోజుల్లో ఇక్కడ నివసించడంతో వారు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. గురునానక్‌ 550వ జయంతి (Gurunanak Jayanthi) సందర్భంగా 2019 నవంబర్‌ 9న ఈ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించగా.. 2019 అక్టోబర్‌ 24న ఐదేళ్ల పాటు భారత్‌, పాక్‌లు ఈ నడవాపై ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారతీయులు వీసా లేకుండానే

తాజాగా ఐదేళ్ల ఒప్పందం ముగిసిపోవడంతో మరో ఐదేళ్ల పాటు కాలపరిమితిని పెంచుతూ ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. భారతీయులు ఎలాంటి వీసా(Visa) అవసరం లేకుండానే ఈ నడవా ద్వారా పాక్‌లోని పవిత్ర గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను దర్శనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌ నివేదిక ప్రకారం.. 2022 వరకు 1,10,670 మంది భారత్‌తోపాటు, విదేశాల్లో ఉంటున్న భక్తులు ఈ కారిడార్‌ను ఉపయోగించుకున్నారు.

Share post:

లేటెస్ట్