
అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ప్రస్తుతం టాలీవుడ్ లో 100 శాతం హిట్ రేట్ ఉన్న యంగ్ డైరెక్టర్. ఆయన సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రతి సినీ లవర్ బలంగా నమ్ముతాడు. అందుకే హీరో ఎవరైనా.. ప్రొడ్యూసర్ ఎవరైనా.. హీరోయిన్లు ఎవరైనా.. అనిల్ రావిపూడి సినిమా తీశాడంటే థియేటర్ కు వెళ్లాల్సిందేనని ఫిక్స్ అయిపోతారు. చేసింది 8 సినిమాలే.. అందులో ప్రతి ఒక్కటీ బ్లాక్ బస్టర్.
రూ.100 కోట్ల మార్క్ దాటేసి
అందుకే అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ హిట్ మ్యాన్ అయిపోయాడు. ఈ సంక్రాంతి పండుగకు ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ అనే సినిమాతో వచ్చాడు అనిల్. ఎఫ్-2, ఎఫ్-3 సినిమాల తర్వాత వెంకీ-అనిల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేసింది. ఇక ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటేసి దూసుకెళ్తోంది. అయితే తీసిన ప్రతి సినిమా కమర్షియల్ గా ఆడటం వెనుక అనిల్ రావిపూడి హిట్ మంత్ర, సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?
అదే అనిల్ సక్సెస్ సీక్రెట్
‘సాధారణంగా ప్రతి సినిమా అందరికీ నచ్చదు. కొందరికి వావ్ సూపర్ గా ఉందనిపిస్తే.. మరికొందరికి అందులో ఏముందిలే అని అనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. సినిమా సక్సెస్ అనేది మాత్రం వసూళ్లపైనే ఆధారపడి ఉంటుంది’ అంటాడు అనిల్ రావిపూడి. నిర్మాత ఖర్చు పెట్టిన రూపాయికి రూపాయికి రావాలనేదే దృష్టిలో పెట్టుకుంటానని.. దాని కోసం ఎంతైనా కష్టపడతానని.. మిగిలినవన్నీ తర్వాత.. అదే తన సక్సెస్ సీక్రెట్ (Anil Ravipudi Success Secret) అని చెప్పుకొచ్చాడు. బడ్జెట్‌కు మించి సినిమాలు తెరకెక్కించనని తెలిపాడు.
అనిల్ లేనిదే మేం లేము
‘మేం బావిలో పడిపోతున్నామని ఎంతో మంది ఆనందపడేలోపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మమ్మల్ని పక్కన పడేసింది. అనిల్ లేనిదే మేం లేము’ అన్న నిర్మాత శిరీష్ (Producer Shirish) వ్యాఖ్యలే అనిల్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అనడానికి నిదర్శనం. తక్కువ రోజుల్లోనే (సంక్రాంతికి వస్తున్నాం 72రోజులు, ఎఫ్ 2 (F2).. 74రోజులు) షూటింగ్ పూర్తి చేస్తారనే పేరూ దక్కించుకున్నారు అనిల్. పేపర్‌పైనే స్టోరీని ఎడిట్ చేసి, ఎంత వరకూ అవసరమో అంత వరకే షూట్ చేయడం ఈ డైరెక్టర్ కు అలవాటు. ఇక తన ప్రతి సినిమా 2:20 నిమిషాల నిడివికి మించి ఉండేందుకు ఆయన ఇష్టపడడు.
ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనిల్
డైలాగ్ రైటర్ గా ఒడిదొడుకుల ప్రయాణం చేసిన అనిల్.. పటాస్ (Patas) సినిమాతో టాలీవుడ్ లో రీసౌండ్ చేశారు. కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2015లో జనవరి 23న రిలీజ్ అయి ప్రొడ్యూసర్లకు మూడు రెట్ల వసూళ్లు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పటాస్ తర్వాత సాయి దుర్గాతేజ్‌తో ‘సుప్రీమ్ (Supreme Movie)’, రవితేజ ‘రాజా ది గ్రేట్’, వెంకటేశ్- వరుణ్‌ల ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, మరోసారి వెంకీతో తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. అన్నీ సూపర్ హిట్లే. ఈ ఎనిమిది సినిమాల్లో ఐదు (సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం) శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లో రూపొందాయి.