టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయింది. ముంబయికి మకాం మార్చిన ఈ భామ మయోసైటిస్ వల్ల ఒక ఏడాది సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఇక ఇటీవలే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు వరుస పెట్టి మళ్లీ సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం సామ్ చేతిలో రక్త్ బ్రహ్మాండ్, మా ఇంటి బంగారం (Ma Inti Bangaram) వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవే కాకుండా సామ్ తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన ఓ లేడీ డైరెక్టర్ తో మరోసారి పని చేయనుందట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?
సామ్-నందిని సినిమా
టాలీవుడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) గురించి తెలియని వారుండరు. ఇక సమంత, నందినీ ఫ్రెండ్షిప్ గురించి కూడా తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఓ బేబీ (Oh Baby)’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. తాజాగా సమంత, నందినీ రెడ్డి పోస్టులు చూస్తుంటే ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాకు పని చేయబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ముందుకు సాగుదాం
మార్చి 4వ తేదీన దర్శకురాలు నందినీ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సమంత (Samantha New Film) తన ఫ్రెండ్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. ఇన్ స్టా వేదికగా “హ్యాపీ బర్త్ డే నందినీ రెడ్డి. ఇప్పుడు అందరి చూపు నీ మీదే. ఈ ఏడాది నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుకు సాగిపోదాం” అంటూ సమంత పోస్ట్ చేసింది. ఇక దీనికి నందినీ రెడ్డి సమాధానం ఇస్తూ.. “మళ్లీ మొదలెట్టే క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ముందుకు సాగుదాం” అని సమాధానం ఇచ్చారు. వీరి పోస్టులు చూసి ఈ ఇద్దరూ కలిసి ఏదో సినిమా చేయబోతున్నారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి అది నిజమో కాదో వీళ్లే చెప్పాలి.






