భిన్నమైన పాత్రలు, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన నటుడు కమల్ హాసన్(Kamal Haasan). సౌత్ సినిమా నుంచే కాదు, భారతీయ సినీ రంగాన్ని మలుపు తిప్పిన కమల్ హాసన్ ఒక దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా తన కెరీర్ లో ఎన్నో ఘన విజయాలు ఉన్నా… అతడి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. ముఖ్యంగా కమల్ తన ప్రేమ విషయంలో ఓడిపోయాడు. ఆయన ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకోలేకపోయాడు. ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదో.. ఆయన ప్రేమ ఎందుకు ఓడిపోయింది.. అసలు ఆమె ఎవరు అనేది తెలుసుకుందాం.
కమల్ – శ్రీవిద్య ప్రేమకథ ఎప్పుడు మొదలైందంటే…
కమల్ హాసన్ నటి శ్రీవిద్య(Srividya) తో ప్రేమలో పడ్డాడు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో, 1970ల మధ్యకాలంలో శ్రీవిద్యతో కలిసి అనేక తమిళ చిత్రాల్లో నటించారు. షూటింగ్ ల సమయంలో ఏర్పడిన పరిచయం, క్రమంగా ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయం ఇద్దరి కుటుంబాలకు తెలిసింది. వారి పెళ్లి చేయాలనీ కూడా అనుకున్నారు.

పెళ్లి ఎందుకు జరగలేదు?
అయితే కమల్, శ్రీవిద్య ప్రేమకథలో మలుపు అక్కడే మొదలైంది. శ్రీవిద్య తల్లి, పెళ్లికి మరో ఐదేళ్లు ఆగాలని చెప్పడంతో… అప్పటికే 22 ఏళ్ల యువకుడైన కమల్ హాసన్, ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. శ్రీవిద్య తల్లి అలా చెప్పడంతో వీరిద్దరి ప్రేమకథ పెళ్లి వరకు వెళ్లక ముందే ముగిసిపోయింది.
కమల్ విడిపోయినా తర్వాత శ్రీవిద్య భాద
కమల్‌తో ఉన్న బంధం నా జీవితాన్ని మార్చేసింది. ప్రేమంటే అర్థం అయ్యింది. కానీ అది నా లోనుండే వదిలిపెట్టలేని బాధగా మారింది. కమల్ పెళ్లి విషయాన్ని తెలిసిన వెంటనే తన మనసు పూర్తిగా కృంగిపోయిందని, చాలా కాలం మానసికంగా తట్టుకోలేక పోయానని శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంతో చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా కమల్, తన జీవితంలో నిజమైన ప్రేమ శ్రీవిద్యతోనిదే అన్న సంగతి స్పష్టం చేశారు.
కమల్ తర్వాతి జీవితంలో...
శ్రీవిద్యతో విడిపోయిన తర్వాత, 1978లో శాస్త్రీయ నర్తకి వాణిని పెళ్లి చేసుకున్నారు. కానీ 1988లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం నటి సారికను వివాహం చేసుకొని ఇద్దరు కుమార్తెలకు తండ్రయ్యారు – శృతి హాసన్, అక్షర హాసన్. అయితే ఈ పెళ్లీ 2004లో ముగిసింది. అనంతరం కొన్నేళ్ల పాటు గౌతమితో సహజీవనం కొనసాగించారు.
శ్రీవిద్య చివరి కోరిక – కమల్‌ను చూడాలని
శ్రీవిద్య తన జీవితంలో రెండో వివాహం చేసుకున్నా, అది కూడా విఫలమైంది. అనారోగ్యం కారణంగా సినీ రంగానికి బ్రేక్ ఇచ్చిన ఆమె, క్యాన్సర్ తో పోరాటం చేసి ఓడిపోయింది. అనారోగ్యం తో ఉన్నప్పుడు నాకు కమల్ ని చూడాలని ఉంది అనే కోరికను వ్యక్తం చేసింది.
ఈ విషయం తెలిసిన కమల్ హాసన్, ఒక్కసారిగా తిరువనంతపురం వెళ్లి, శ్రీవిద్యను చూసి వచ్చారు. అప్పటికే ఆమె ఆరోగ్యం నిలకడగా లేకపోయినా, కమల్‌ను చూసిన ఆనందంతో ఆమె కళ్లలో ఓ వెలుగు కనిపించిందట.
శ్రీవిద్య మరణం
2006 అక్టోబర్ 19న, కేవలం 53 ఏళ్ల వయసులో శ్రీవిద్య ఈ లోకాన్ని విడిచిపోయింది. అయితే ఆమె ప్రేమకథ మాత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. కమల్ హాసన్ కూడా ఎన్నిసార్లు ప్రేమ గురించి మాట్లాడినా, శ్రీవిద్య పేరే చెప్తారట.






