తమిళం నుంచే కన్నడ పుట్టిందని చేసిన ఒక్క వ్యాఖ్యతో ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను (Kamal Haasan) వివాదాలు చుట్టుముట్టాయి. కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలో ఆయన కొత్త సినిమా సైతం విడుదల కావడం. ఇదిలా ఉండగా కమల్ హాసన్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ (Rajya Sabha nomination) దాఖలు చేయడాన్ని కూడా వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.
డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం..
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీని స్థాపించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. దీంతో 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం MNMకు ఎగువసభ స్థానం కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే-ఎంఎన్‌ఎం ఇటీవలే ఖరారు చేసింది.
సారీ చెప్పని లోకనాయకుడు
అయితే ‘థగ్‌లైఫ్’ సినిమా ఈవెంట్‌లో కమల్ మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ పుట్టిందని అనడంతో భాషా వివాదం చెలరేగింది. కమల్ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కర్ణాటకలో థగ్‌లైఫ్ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను మంగళవారం విచారించిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ‘కేఎఫ్‌సీసీ’కి కమల్ లేఖ రాశారు. కానీ సారీ మాత్రం చెప్పలేదు.






