నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. థగ్ లైఫ్ సినిమా రిలీజ్నేపథ్యంలో ఓ ఈవెంట్లో కన్నడ భాషపై కమల్ హాసన్చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ సినిమాని కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) హైకోర్టును ఆశ్రయించింది.
నటుడిపై ఆగ్రహం..
కాగా ఆ పిటిషన్ ను మంగళవారం విచారించిన న్యాయస్థానం నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. అయితే తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ రాశారు. కానీ అందులోనూ సారీ చెప్పలేదు. ఆ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. ఆ లెటర్‌ను కమల్ తరఫు న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. కమల్ వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని, ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ మాట్లాడారని, కన్నడ భాష గురించి కాదని న్యాయవాది వాదించారు. కమల్ తాను చెప్పాలనుకుంది చెప్పారని, పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంటే కర్ణాటకలో తన సినిమాని విడుదల చేయరు అని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కర్ణాటక ఫిల్మ్‌ఛాంబర్‌తో సంప్రదింపులు జరిపేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని ప్రొడ్యూసర్ తరపు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 10కి వాయిదా వేసింది.






