
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు రానున్నారు. నేడు జరగనున్న బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశానికి (BRS Executive Meeting) ఆయన హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. కార్పొరేషన్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవం
గతేడాది జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ భవన్ కు వచ్చారు. ఏడు నెలల తర్వాత తిరిగి నేడు ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఆ పార్టీ రజతోత్సవానికి రంగం సిద్ధం చేస్తున్న సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాగా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది.
బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం
ఇక ఇవాళ్టి సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు సంస్థాగత కమిటీలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టతనిచ్చేఅవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గతేడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా ప్లీనరీ జరపలేదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్లీనరీ (BRS Plenary Meeting) లేదా బహిరంగసభ నిర్వహించే అంశంపై ఇవాళ్టి భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.