మలయాళ సినీ నటి హనీ రోజ్ (Honey Rose Case)పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వయనాడ్‌లో బాబీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
హనీ రోజ్ హర్షం
ఈ పరిణామంపై తాజాగా హనీ రోజ్ స్పందించారు. ఇప్పుడు తనకెంతో ప్రశాంతంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసు విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.
30మందిపై కేసు నమోదు
కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై ఓ వ్యాపారవేత్త అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని హనీరోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆవేదన చెందారు. తనను వేధించిన వ్యక్తి వివరాలు వెల్లడిస్తూ హనీరోజ్ (Honey Rose Harassment Case) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. వ్యాపారవేత్త బాబీని అదుపులోకి తీసుకుంది.
హనీ రోజ్‌కు న్యాయం చేస్తాం
మరోవైపు నటి హనీ రోజ్‌కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (AMMA) మద్దతు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఆమెపై అభ్యంతరకరంగా పెడుతున్న పోస్టులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించింది. అవసరమైతే న్యాయ సాయం అందజేస్తామని మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం వెల్లడించింది.







