Mana Enadu : శబరిమలలో ధర్నాలు, నిరసనలపై కేరళ హైకోర్టు (Kerala High Court) కీలక తీర్పు వెలువరించింది. శబరిమలలో తమ సేవలకు ముందుగానే రుసుం చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ఆలోచనకు వ్యతిరేకంగా డోలీ కార్మికులు (Doli Labor) సమ్మె చేపట్టారు. ఇది కాస్తా కోర్టుకు చేరడంతో తాజాగా కేరళ హైకోర్టు ఇక నుంచి శబరిమలలోని పంపా, సన్నిధానంలో ధర్నాలు, నిరసనలు, సమ్మెలపై నిషేధం విధిస్తూ తీర్పు వెల్లడించింది. వీటివల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని.. డోలీ కార్మికులకు ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని న్యాయస్థానం సూచించింది.
డోలీ సర్వీస్ అంటే ఏంటి..?
పంపా, సన్నిధానం మధ్య ట్రెకింగ్ దారిలో నడవలేని స్థితిలో ఉన్న యాత్రికులను డోలీల్లో మోస్తూ శబరిమల (Sabarimala)కు తీసుకువెళ్తారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న యాత్రికులు ఎక్కువగా ఉపయోగించుకునే ఈ డోలీని ఒక్కోదాన్ని నలుగురు కార్మికులు మోస్తారు. యాత్రికుల బరువు ఆధారంగా ఈ సర్వీస్‌కు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఐదు కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుంది.
డోలీ కార్మికుల సమ్మె
మొత్తం 308 డోలీలు ఉండగా.. బోర్డు వద్ద దాదాపు 1532 మంది కార్మికులుగా నమోదు చేసుకున్నారు. అయితే శబరిమలలో డోలీ సేవలకు యాత్రికులు ముందుగానే రుసుము చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు తాజాగా నిర్ణయించడంతో డోలీ కార్మికులు పంపా వద్ద సమ్మెకు దిగారు. ప్రీ పెయిడ్ (Doli Pre Paid Charge) విధానం గురించి తమతో సంప్రదింపులు జరపకుండానే నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చించిన తర్వాత డోలీ కార్మికులు నిరసనను విరమించుకున్నారు.
హైకోర్టు కీలక ఆదేశాలు
అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆధ్యాత్మిక ప్రదేశం అని, అక్కడ ధర్నాలు, నిరసనలకు అనుమతించలేమని స్పష్టం చేసింది. దేవస్వమ్ బోర్డు (Travancore Devaswom Board) భవిష్యత్‌లో ఇది పునరావృతం కాకుండా చూడాలని పేర్కొంది. శబరిమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న భక్తులకు డోలీ సేవ అందుబాటులో లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డోలీ సేవలను ప్రీ పెయిడ్ విధానంలో ప్రారంభించాలని నిర్ణయించిన బోర్డు.. పంపా, నీలిమల వద్ద మూడు కౌంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటర్ ద్వారా వసూల్ చేసిన మొత్తాన్ని డోలీ కార్మికులకు అందజేయనుంది.