కేరళలోని వయనాడ్ జిల్లా ప్రజలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్ (Man Eater) (పులి) మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు తెలిపారు. మరో క్రూర మృగం దాడిలో పులి మరణించినట్లు దాని శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా చీఫ్ ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా తెలిపారు. దీని వయసు దాదాపు ఏడేళ్లు ఉంటుందని చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
వయనాడ్ జిల్లాలో ఇటీవల ఓ మహిళపై పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్ ఈటర్‌గా (Man Eater Died) కేరళ సర్కార్ ప్రకటించింది. అది కంటపడితే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. పులిని మ్యాన్‌ఈటర్‌గా ప్రకటించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. కాగా ఇవాళ తెల్లవారుజామున పులి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
కంటబడితే చంపేయండి
వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పని చేస్తున్న రాధ (45) అనే మహిళపై ఇటీవల పెద్దపులి దాడి చేసి ఆమె శరీరంలో కొంత భాగాన్ని తినేసింది. ఆ తర్వాత అటవీశాఖ అధికారి జయసూర్యపైనా దాడికి తెగబడింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం, ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ పులి కనిపిస్తే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది.






