తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుపరితీతమైన పేరు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao). విలన్ పాత్రలతో పాటు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కోటా శ్రీనివాసరావు గత కొన్ని కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వయస్సు మీదపడటంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కెమెరా ముందుకు రావడం లేదు.
1978లో సినీ రంగంలోకి అడుగుపెట్టి 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమా వరకు నలభై పైచిలుకు సంవత్సరాల సినీ ప్రయాణాన్ని కొనసాగించిన కోటా శ్రీనివాసరావు, తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. నటనలో తన ప్రతిభకు గుర్తింపుగా తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు.
కేవలం సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కోటా తనదైన ముద్ర వేశారు. 1999 నుండి 2004 వరకూ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య కారణాలతో ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
సుమారు రెండేళ్లుగా సినీ రంగానికి పూర్తిగా దూరంగా ఉన్న కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పూర్తిగా బక్కచిక్కిపోయి, అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఈ మధ్యే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను గణేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, “కోటా బాబాయ్‌ని కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
A moment of respect and care 🤍
Producer @ganeshbandla visits veteran actor #KotaSrinivasaRao garu at his residency!#BandlaGanesh #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IeMsBIlYx3— Telugu FilmNagar (@telugufilmnagar) June 10, 2025
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, కోటా ఆరోగ్య పరిస్థితిపై సినీ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోల్లో ఆయన బక్కచిక్కిపోయి, కుడిపాదానికి కట్టుతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ తో కలిసి దిగిన ఫోటోలు కోటా అభిమానుల మనసులో ఆవేదనను కలిగిస్తున్నాయి. తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆరోగ్యంగా కనిపించాలని కామెంట్స్ పెడుతున్నారు.






