Mana Enadu : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ (Telangana Assembly Sessions 2024) ఉభయ సభలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR Auto News) ఆటో నడుపుతూ అసెంబ్లీ చేరుకున్నారు. అందులో కొందరు ఎమ్మెల్యేలను కూడా ఎక్కించుకున్నారు. ఇక గులాబీ పార్టీ నేతలంతా ఖాకీ చొక్కాలు ధరించారు.
ఆటో నడిపిన కేటీఆర్
ఈ సందర్భంగా.. ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
*రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన @BRSparty ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలి
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ… pic.twitter.com/B71Bb0MQsa
— KMR@KTR (@kmr_ktr) December 18, 2024
శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని భరోసా కల్పించిన కేటీఆర్.. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్మికులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని తెలిపారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆయన.. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.. మరోవైపు.. శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.






