
Mana Enadu : ఫార్ములా ఈ-రేసు వ్యవహారం(Formula E Race Case)లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR ACB Case Updates) పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అభియోగాలతో ఇటీవలే ఆయనపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో అణా పైసా అవినీతి లేదని అన్నారు.
ముఖ్యమంత్రా.. మంత్రులా?
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్ (KTR On Formula E Race) రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై నిప్పులు చెరిగారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో తనపై నమోదైన కేసులో అవినీతి లేదని తేలిందని ఆయన అన్నారు. ఆయనే అవినీతి జరగలేదని అన్నారని.. ప్రభుత్వం కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏలో చేసే ప్రతి పనికి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పారు. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉందని క్లారిటీ ఇచ్చారు.
ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదు?
ఫార్ములా ఈ-రేసులో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేటీఆర్.. ముఖ్యమంత్రా (CM Revanth Reddy).. మంత్రులా.. తప్పుదోవ పట్టిస్తుందెవరో తెలియాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఓఆర్‌ఆర్ లీజు అంశంలో సిట్ ఏర్పాటుపై కూడా కేటీఆర్ స్పందించారు. టీఓటీ (Toll Operate Transfer) పద్ధతి దేశంలో ఇప్పటికే అమలులో ఉందని.. ఓఆర్‌ఆర్ (ORR Lease) లీజు డబ్బు రైతు రుణమాఫీకి వాడామని తెలిపారు. అప్పటి కేబినెట్ సబ్ కమిటీ.. ఓఆర్ఆర్ లీజుకు సూచించిందని.. నేషనల్ హైవే అథారిటీ తరహాలోనే ఓఆర్‌ఆర్‌ను లీజుకు ఇచ్చామని స్పష్టం చేశారు. అవినీతి జరిగితే ఆ ఒప్పందం ఇంకా ఎందుకు రద్దు చేయలేదు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.