Mana Enadu : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) ఏడోరోజు కొనసాగుతున్నాయి. “రైతు భరోసా’ విధి విధానాలపై స్వల్పకాలిక చర్చతో సభ ప్రారంభమైంది. ఇవాళ్టి సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చామని తెలిపారు. 2019-20లో 141 లక్షల ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2020-21లో 204 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు.
అసలు ఈ చర్చ ఎందుకు?
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 4.50 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామని.. మరి వారికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు (Rythu Bandhu) ఇస్తారో.. లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధుకు కోతలు పెట్టాలని చూస్తున్నారని.. రైతుబంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు? అని ప్రశ్నించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పొడిగించాలని కోరారు. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అది నిరూపిస్తే రాజీనామా చేస్తాం
“కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదంటున్నారు. మా పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి చూసొద్దాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మీరు చూపెడితే బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుంది.” అని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
రాజకీయ సన్యాసం తీసుకుంటా
మరోవైపు.. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ (Runa Mafi) జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. డిసెంబరు 9న ఏకకాలంలో ఒకే పెన్ స్ట్రోక్ తో రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమో.. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేసేస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ రకమైన బుకాయింపు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.






