
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించి ప్రజలతో ముచ్చటించనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన సూర్యాపేట, 23వ తేదీన కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటిస్తారు. ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నేతలు తెలిపారు.
కేటీఆర్ జిల్లాల పర్యటన
భారత్ రాష్ట్ర సమితి (BRS Silver Jubilee Celebrations) సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేటీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడుతూ.. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలపైనా ప్రభుత్వాన్ని నిలదీసే కార్యచరణపై దృష్టి సారించాలన్న కేసీఆర్ (KCR) ఆదేశాలతో కేటీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు.
20న సూర్యాపేటకు కేటీఆర్
ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలతో కేటీఆర్ (KTR District Tour) సమావేశం అవుతారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరుపై ప్రశ్నించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపైనా పార్టీ శ్రేణులకు కేటీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, మార్చి 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు . 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతోపాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీ ఏర్పరచుకున్న ఆత్మీయ బంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తు చేయనున్నారు కేటీఆర్.