ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేరా’ (Kubera). శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు ఉమ్మడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.75 (జీఎస్టీ అదనం) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయమై చిత్ర బృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి.
శేఖర్ కమ్ముల స్టైల్కు భిన్నంగా కుబేర..
ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల తన స్టైల్‌కు భిన్నంగా కుబేరా ఉంటుందని కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో నాగార్జున (Nagarjuna) తెలిపారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే నిజాలు ఈ మూవీలో ఉన్నాయన్నారు. ‘శేఖర్ కమ్ముల ఈ సినిమాలో చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు విని నేనే షాక్ అయ్యాను. న్యాయంపై ఆయనకు బలమైన నమ్మకం ఉంది. సమాజంలో చూస్తున్న విషయాలనే ఇందులో చెప్పారు. పేద, ధనిక, మధ్యతరగతి కుటుంబాల్లో ఏం జరుగుతుందనే దాన్ని ఇందులో చూపించారు. తాను అనుకున్న కథను చాలా అందంగా స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు’ అని అన్నారు.
భారీ రన్ టైమ్
కుబేరా మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. బోర్డు సూచనల మేరకు మార్పు చేర్పులు చేసిన తర్వాత 182 నిమిషాల 38 సెకన్ల నిడివితో (Kubera Run Time) థియేటర్స్‌లో విడుదల కానుంది. అంటే 3 గంటల 2 నిమిషాలకు పైనే మూవీ రన్‌టైమ్ ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ అగ్ర కథానాయకులు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన చిత్రాలు మాత్రమే 3 గంటలకు పైన ఉన్నాయి. సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ స్థాయిలో రన్‌టైమ్ కలిగి ఉండటంతో శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






