
తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్(CM Revanth) సర్కాన్ ప్రణాళికలు చేపడుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు(Panchayats), MPTCలు, ZPTC, వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,694 వార్డు స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, 31 జిల్లా పరిషత్‌లు (ZPలు), 566 ZPTC స్థానాలు, 566 మండల పరిషత్‌లు (MPPలు), 5,773 MPTC స్థానాలు ఖరారయ్యాయి.
తగ్గిన గ్రామ పంచాయతీల సంఖ్య
కాగా ఈ సంఖ్యలు 2019 ఎన్నికలతో పోలిస్తే కొంత తగ్గాయి. దీనికి కారణం వేగవంతమైన పట్టణీకరణ(urbanization)గా తెలుస్తోంది. మరోవైపు 71 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో విలీనం చేయడం. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,848 నుంచి 12,778కి, వార్డుల సంఖ్య 1,13,136 నుంచి 1,12,694కి తగ్గింది. ఎంపీటీసీ స్థానాలు 5,847 నుంచి 5,773కి తగ్గగా, ఎంపీపీల సంఖ్య 539 నుంచి 566కి పెరిగింది.
పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ నిర్ణయం
తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30, 2025 లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, పంచాయతీ రాజ్ శాఖ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్లు, జడ్పీ CEOలు, DPOలు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. అవసరమైన స్టాంపులు, ఫారమ్‌లు, హ్యాండ్‌బుక్‌లు సిద్ధం చేయాలని ఆదేశించింది. అదనంగా, బీసీలకు 42% రిజర్వేషన్‌ను అమలు చేయడానికి పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపారు.