Mana Enadu : పుష్ప-2 సినిమా బెన్ ఫిట్ షో (Pushpa 2 Benefit Show) సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. ఈ కేసులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Arrest) అరెస్టు కూడా అయ్యారు. మరుసటి రోజే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వ్యవహారంలో సంధ్య థియేటర్ యాజమాన్యం, పోలీసుల కామెంట్స్ పొంతనలేకుండా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
నెట్టింట రెండు లేఖలు హల్ చల్

ఈ క్రమంలోనే తాజాగా పుష్ప-2 చిత్ర ప్రీమియర్ షో వ్యవహారంలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. పుష్ప-2 నటీనటులు సహా యూనిట్ వస్తున్నట్లు పోలీసులకు తెలుపుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం (Sandhya Theatre Incident) లిఖితపూర్వకంగా అనుమతి కోరిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే థియేటర్‌కు ఇరువైపులా రెస్టారెంట్లు ఉండటం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపినట్లు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాసిన లిఖితపూర్వక లేఖ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నటులెవరూ రావొద్దని చెప్పాం

“థియేటర్ కు రెండు వైపులా రెస్టారెంట్లు ఉండటం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంధ్య థియేటర్ వద్ద లోనికి, బయటికి వెళ్లే మార్గంలో సినీ నటులు వచ్చి వెళ్లే అవకాశం లేదు. మూవీ యూనిట్ వస్తే ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేం. అందుకే సంధ్య థియేటర్ వారిచ్చిన లేఖకు వెంటనే అనుమతి నిరాకరించాం.” అంటూ చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. నటులెవరూ ప్రీమియర్ షో (Pushpa 2 Premier Show) కోసం థియేటర్ వద్దకు రావద్దని సంధ్య థియేటర్ యాజమాన్యానికి సూచించినట్లు చెప్పారు.
రెండు లేఖలు.. ఏది నిజం
ప్రస్తుతం సంధ్య థియేటర్ యాజమాన్యం, పోలీసులు రాసిన రెండు లేఖలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే థియేటర్ యాజమాన్యం రాసిన లేఖ అధికారిక లెటర్ హెడ్ పై ఉండగా.. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన రెండో లేఖ చేతితో రాసిన లేఖలా ఉండటం గమనార్హం. అసలు ఈ లెటర్ నిజమా, కాదా అని నెటిజన్లు అయోమయంలో ఉన్నారు. ఈ లేఖ క్రెడిబులిటీని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.






