తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై (Telangana local body elections) హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు (TG High Court) న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి తీర్పు వెలువరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర గడిచినా మళ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి.మాధవిదేవి బుధవారం తీర్పు ఇచ్చారు.
నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారు..
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మొదట తమ వాదనలు వినిపించారు. ‘‘గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి’’ అని వాదించారు.
హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదు?
దీనిపై ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని కోరారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక.. ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై న్యాయవాది సమాధానమిస్తూ.. రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.






