Mana Enadu : గత నెల 25న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions 2024) ఇవాళ్టి (డిసెంబరు 20వ తేదీ)తో ముగిశాయి. తదుపరి సెషన్ వరకు లోక్‌సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం నాడు పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
జేపీసీకి జమిలి బిల్లు
మరోవైపు దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు (జమిలి ఎన్నిక బిల్లును)(One Nation, One Poll)ను లోక్‌సభ శుక్రవారం రోజున జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపింది. ఈనెల 17న దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఈ బిల్లు ఉందని, అందువల్ల జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
మరోవైపు అధికారపక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏ మాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేసింది. అయినా అన్ని పక్షాలూ దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపుతున్నట్లు పేర్కొంది. ఇక.. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ (JPC)లో మొదట లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించగా.. ఆ సంఖ్యను 27, 12కి పెంచారు.






