Mana Enadu : తలనొప్పి, జ్వరం (Fever), ఒళ్లు నొప్పులు.. ఇలా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే పారాసిటమాల్ మాత్ర (paracetamol) వేసుకుంటారు. కొందరైతే జ్వరం వచ్చేలా ఉందని.. ముందే ఓ మాత్ర వేసి పెట్టుకుంటే బెటర్ అని కూడా భావిస్తూ ట్యాబ్లెట్ వాడుతుంటారు. ఇక చాలా మంది పెద్ద వాళ్లు కీళ్ల నొప్పులకు కూడా ఈ మాత్రమే వినియోగిస్తుంటారు. చాలామంది ఇళ్లలో పారాసిటమాల్.. సర్వరోగ నివారణిలా మారింది. మీరు కూడా చీటికిమాటికి పారాసిటమాల్ వేసుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
సర్వరోగనివారిణి పారాసిటమాల్
సర్వరోగ నివారిణిలా పారాసిటమాల్ (paracetamol Problems) ను వాడటం మానేయాలట. ముఖ్యంగా 65 ఏళ్ల పైబడిన వారు ఈ మాత్రల జోలికి పోకపోవడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. పారాసిటమాల్ ను తరచూ వాడటం వల్ల జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయని బ్రిటన్ కు చెందిన నాటింగ్‌హామ్ యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది. “Long-term use of paracetamol and risk of kidney disease: a systematic review and meta-analysis” పేరిట బ్రిటీష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.
పారాసిటమాల్ తో ప్రమాదం
తరచూ పారాసిటమాల్ వాడటం వల్ల జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు 24 శాతం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు 36 శాతం పెరుగుతున్నట్లు బయటపడింది. 19 శాతం కిడ్నీజబ్బులు (Kidney Issues), 7 శాతం అధిక రక్తపోటు, 9 శాతం గుండె (Heart Problems) వైఫల్యమయ్యే అవకాశాలున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. పారాసిటమాల్ కీళ్ల నొప్పిని తగ్గించదని.. నొప్పులకు అసలు కారణమేంటన్నది తెలుసుకొని, అవసరమైన మందులు వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.






