అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత (Madhavi Latha) ‘మా (MAA)’కు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వాటిపై సినీ పరిశ్రమ స్పందించలేదని అన్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
న్యాయ పోరాటం చేస్తాను
‘‘ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) నా గురించి దారుణమైన కామెంట్స్ చేశారు. సినిమా వారిపై ఆరోపణలు సరైనవి కావు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో నాకు క్షమాపణలు చెప్పాలి. కానీ అంతటితో సరిపోదు. ఆయనపై నేను న్యాయ పోరాటం చేస్తాను. నాపై ఆయన కామెంట్స్ ను సినీ పరిశ్రమ ఖండించకపోవడం వల్లే నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చాను’’ అని మాధవీ లత తెలిపారు.
మాధవీలత Vs జేసీ ప్రభాకర్ రెడ్డి
డిసెంబరు 31వ తేదీన తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ (New Year 2025) వేడుకలపై మాధవీలతతో పాటు మరో బీజేపీ నాయకురాలు సాధినేని యామిని కీలక వ్యాఖ్యలు చేశారు. వారి కామెంట్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావుతీసింది. అయితే ఆయన కామెంట్స్ పై విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని జేసీ అన్నారు. ఈ క్రమంలో క్షమాపణ కూడా కోరారు.







