Mana Enadu : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం (Maharashtra Cabinet 2024) కొలువుదీరిన విషయం తెలిసిందే. సర్కారు ఏర్పాటైన పది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఇవాళ జరిగింది. నాగ్‌పుర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor CP Radha Krishnan) వీరితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis), ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde), అజిత్ పవార్ (Ajit Pawar)ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాన్‌కులేతోపాటు గణేశ్ నాయక్, రాధాకృష్ణ విఖే పాటిల్, మంగళ్‌ప్రభాత్ లోధా, చంద్రకాంత్ పాటిల్, జయ్‌కుమార్ రావల్, గిరీశ్ మహాజన్, అతుల్ సావే, పంకజ ముండే, ఆశిశ్ శేలార్, అశోక్ ఉయికే, జయ్ కుమార్ గోరె, శివేంద్రసిన్హ భోసలే మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇక శివసేన (Shivsena) నుంచి గులాబ్ రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, దాదా భూసే, శంభూరాజ్ దేశాయ్, ఉదయ్ సామంత్, ఎన్‌సీపీ నుంచి హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, అధితీ తాత్కరే, దత్తత్రేయ భార్నే, నరహరి జిర్వాల్, మానిక్‌రావ్ కొకాటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఇక.. మహారాష్ట్ర మంత్రి వర్గంలో గరిష్ఠంగా 43 మంది మంత్రులు ఉండవచ్చని సమాచారం. వీటిలో 20 బీజేపీకి, 13 శివసేన, 10 ఎన్‌సీపీకి కేటాయించినట్లు తెలిసింది.






