Mana Enadu : మహారాష్ట్ర రాజకీయం (Maharashtra Politics) రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. అయితే సర్కార్ ఏర్పాటు విషయంలో తాజాగా మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లే కన్పిస్తోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పగ్గాలు అందుకోవడం దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde)కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆరోజునే కొత్త సీఎం ప్రమాణం
డిసెంబరు 5వ తేదీన మహారాష్ట్ర (Maharashtra) కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు తెలిసింది. శిందేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) కూడా ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. బుధవారం రోజున బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశంలో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
ప్రతిష్టంభన తొలగిపోయినట్లేనా?
సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి (Mahayuti Alliance) కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పదవి తనకు వద్దని, హోంశాఖ ఇవ్వాలని శిందే పట్టుబట్టినట్లు వార్తలొచ్చాయి. ఎన్డీయే నేత రామ్‌దాస్ అథవాలే తాజాగా ఏక్నాథ్ శిందేతో చర్చలు జరిపి.. డిప్యూటీ సీఎం (Deputy CM) పదవికి అంగీకరించాలని ఆయనకు నచ్చజెప్పగా శిందే సుముఖత వ్యక్తం చేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.