Mana Enadu : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయ్యి పట్టుమని పది రోజులు కూడా కాకముందే గొడవల కారణంగా భార్యను ఓ భర్త అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడే రబియా అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారటంతో ఈనెల 4న విక్రమ్ మన్వర్, రబియా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
రెండ్రోజుల క్రితం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ కూడా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రబియా చనిపోవాలని నిర్ణయించుకుంది. శనివారం ఉదయం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మింగింది. దీంతో ఆందోళన చెందిన భర్త విక్రమ్ మన్వర్.. రబియాను కారులో సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి వద్దకు తీసుకొచ్చి అక్కడి ఫారెస్ట్‌లో వదిలేసి పారిపోయాడు. (man leaves wife in forest).
తీవ్ర అనారోగ్యంతో ఉన్న రబియాను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రబియాను సిద్దిపేటలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. రబియా నుంచి వివరాలు సేకరించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.








