Mana Enadu : రాష్ట్రంలో సర్పంచుల పాలన ముగిసి ఆరు నెలలు దాటింది. ఇంకా పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2024) నోటిఫికేషనే రాలేదు. అప్పుడే కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా గెలిచి సంబురాలు చేసుకుంటున్నారు. ఇటీవల వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆ ఊరికి దరావత్ బాలాజీ అనే వ్యక్తి ఇచ్చిన హామీలతో అతణ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది మరవకముందే మరో గ్రామంలోనూ ఈ ఏకగ్రీవానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు
”వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ (Sarpanch) పదవికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.2 కోట్లు ఇస్తాను” అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి గ్రామంపచాయతీకి చెందిన పూల మద్దిలేటి అనే వ్యక్తి ఈ ఆఫర్ ప్రకటించాడు. పోటీ లేకుండా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చేస్తానని, రెండు కోట్ల రూపాయలను పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఇస్తానని పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ మారింది.
భలే మంచి ఆఫర్
గతంలో సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections 2024) పోటీ చేసే అభ్యర్థులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యాయని గ్రామస్థులు అంటున్నారు. అందుకే ఏకంగా ఒకేసారి రెండు కోట్లు రూపాయలు ఇస్తానని ఈ అభ్యర్థి చెబుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. మరి మద్దిలేటి ఆఫర్ కు ఎర్రవెల్లి వాసులు ఓకే చెబుతారా లేదా తిరస్కరిస్తారో చూడాలి. ఏదేమైనా గానీ ఈ వ్యవహారం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.