టాలీవుడ్ లో ఇటీవల మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Fight) హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచు మోహన్ బాబు, మనోజ్ ల మధ్య వైరం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు.
అసలేం జరిగిందంటే?
తాను సంపాదించిన ఇల్లు, ఆస్తులు మంచు మనోజ్ (Manchu Manoj) ఆక్రమించారంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు.. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని తన ప్రతినిధులతో పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
కలెక్టరేట్ కు మంచు ఫ్యామిలీ
ఇక మోహన్ బాబు ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్‌కు వారం క్రితం నోటీసులు పంపగా.. జనవరి 19న ఆయన కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు వచ్చారు. ఇక తాజాగా ఇదే కేసులో మంచు కుటుంబ సభ్యులు (Manchu Family Controversy) ఇవాళ రంగారెడ్డి కలెక్టరేట్ లో విచారణకు హాజరయ్యారు.
నా పోరాటం వారి కోసమే..
తమ విద్యాసంస్థలు, ట్రస్ట్‌లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే అన్నయ్య మంచు విష్ణు (Manchu Vishnu).. తండ్రి మోహన్‌బాబును అడ్డుపెట్టుకుని నాటకమాడుతున్నారని మంచు మనోజ్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తమ వద్ద డబ్బుల్లేవ్ అంటున్న తండ్రి, అన్నయ్యలు రూ.వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించారు. తన పోరాటం విద్యార్థులు, బంధువుల కోసమే కానీ.. ఆస్తుల కోసం కాదని స్పష్టం చేశారు.






