Mana Enadu : ప్రముఖ నటి మంచు లక్ష్మీ (manchu Lakshmi) ఓవైపు వెండితెరపై.. మరోవైపు డిజిటల్ మీడియాలో తన హవా సాగిస్తోంది. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీసులతో అలరించిన మంచులక్ష్మీ తాజాగా తన మకాం ముంబయికి మార్చింది. ఇక హిందీ ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
మరోవైపు ఇవాళ మంచు లక్ష్మీ పుట్టిన రోజు సందర్భంగా “ఆదిపర్వం (Adiparvam)” సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన “ఆదిపర్వం” మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్యం ఓం పోషిస్తున్నారు.
పీరియాడిక్ లవ్ స్టోరీగా ఆదిపర్వం
ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఆమె చేయని, ఓ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ – “మేము అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రంగా “ఆదిపర్వం” ను మలిచానన్న సంతృప్తి మిగులుతోంది. మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, శివ కంఠమనినేని, ఎస్తేర్ పాత్రలకు జనం నీరాజనం పలుకుతారు. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించాం. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా.” అని అన్నారు.
సహ నిర్మాత గోరెంట శ్రావణి మాట్లాడుతూ మంచు లక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిపర్వం తెలుగు చిత్రాల్లో ఒక గొప్ప ప్రయత్నంగా ప్రశంసలు దక్కించుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు. మూవీ టీమ్ ఎంతో సపోర్ట్ చేశారుని.. అందరికీ గుర్తుండే ఒక మంచి సినిమాగా ఆదిపర్వం ఉంటుందని తెలిపారు.






