టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన ఓ మంచి పని చూసి ఇప్పుడు అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్న ఆయన.. వారికి తోడుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మన మంచు అన్న ఇంత మంచివాడా అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. స్నో అన్న హార్ట్ చాలా మంచిది భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
120 మంది అనాథల దత్తత
తిరుపతిలోని బైరాగి పట్టెడ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను మంచు విష్ణు దత్తత తీసుకున్నారు. వారికి విద్యా, వైద్యంతో పాటు అన్ని విషయాల్లో ఓ ఫ్యామిలీ మెంబర్ లా తోడుంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి స్వలాభం లేకుండా సహృదయంతో మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి 120 మందికి పైగా అనాథలను ఆదరిస్తున్నారని మంచు విష్ణు అన్నారు. అందుకే వారికి అన్నగా, ఇంటి పెద్దగా తోడుంటానని భరోసా కల్పించారు. అందరూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని అందుబాటులో ఉన్న అనాథలకు సాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
భోగి వేడుకల్లో విష్ణు, మోహన్ బాబు
భోగి వేడుకల సందర్భంగా ఇవాళ ఉదయం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ (Mohan Babu University)లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు, విష్ణు పాల్గొన్నారు. ‘‘ప్రతి రోజు బాగుండాలని భగవంతుడిని కోరుకుంటాం, అందరూ బాగుండాలి. సంక్రాంతి అంటే రైతు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇలాంటి పండగలను ఆనందంగా జరుపుకోవచ్చు. సినిమా మిత్రులకు వారు తీసిన సినిమా హిట్ అయితేనే నిజమైన పండగ, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరవు కాటకాలు రాకూడదని, రైతు బాగుండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా పండగ చేసుకోండి’’ అంటూ విష్ణు, మోహన్ బాబు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.







